ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు
- తుడుం దెబ్బ – ఏఈడబ్ల్యూసీఏ – ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు
- ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఆదివాసీ ఉద్యమంలో భాగస్వామి కావాలి: తుడుం దెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య
తెలుగు గళం ములుగు :
ఆదివాసి హక్కుల పోరాట సమితి – తుడుం దెబ్బ, ఏఈడబ్ల్యూసీఏ, ఆధార్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని “నిరసన దినంగా” రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిస్తున్నామని ఆదివాసి హక్కుల పోరాట సమితి – తుడుం దెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య తెలిపారు. భారత రాజ్యాంగంలోని 244వ అధికరణ ప్రకారం అమలులో ఉన్న ఐదవ షెడ్యూల్, 1/70 చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 వంటి చట్టాలు ఆదివాసీల రక్షణ కోసం ఉన్నప్పటికీ, వాటి అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, స్వయం పాలన, జీవనాధారాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలు సాగు చేస్తున్న సుమారు 8 లక్షల ఎకరాల భూములకు హక్కు పట్టాలు ఇవ్వాలని, పోడు భూములకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని, 1/70 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, 2023లో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న 1/70 చట్టానికి సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాపాడేలా వెంటనే పక్షకర్తగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెం.3 స్థానంలో చట్టబద్ధమైన కొత్త జీవోను తీసుకురావాలని, ఆదివాసులపై అటవీ శాఖ నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని, ఐటీడీఏలో గతంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలను పునరుద్ధరించాలని, ఐదవ షెడ్యూల్, 1/70 చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006లను పగడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9న రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో తుడుం దెబ్బ, ఏఈడబ్ల్యూసీఏ, ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, నల్ల టోపీలు, నల్ల టీ-షర్టులు ధరించి నిరసన తెలుపుతామని తెలిపారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కొమరం భీమ్ విగ్రహాలకు నివాళులర్పించి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఆదివాసీ ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిరసన దినంగా విజయవంతం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన ఆదివాసీ హక్కులను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు పొడెం రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం జనార్ధన్, చింత కృష్ణ, జిల్లా అధ్యక్షులు చందా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం సురేష్, మాజీ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, ఉపాధ్యక్షులు ఎట్టి రాజబాబు, సిద్దబోయిన సర్వేశ్వరావు, కుచ్చింటి చిరంజీవి, లాయర్ చింత సమ్మయ్య, చింత సోమరాజు, వాసం శ్రావణ్, కోట సంపత్, పొడెం నర్సింగరావు, విజయ్, బిక్షపతి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు గొంది కిరణ్, తాడ్వాయి మండల అధ్యక్షుడు చంద నవీన్, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఆలం రాంబాబు, వెంకటాపురం మండల అధ్యక్షుడు కనితి వెంకటకృష్ణతో పాటు జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.