
ఈ69 న్యూస్ న్యూఢిల్లీ, మార్చి 13:
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య కేంద్రాల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ఆయుష్ వైద్య సేవలు పొందుతున్న ప్రజలకు నాణ్యమైన మందులు అందుతున్నాయా అనే అంశంపై వివరాలు కోరుతూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆమె ప్రశ్నించారు.గత మూడు సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులు, వైద్య కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో తెలియజేయాలని ఎంపీ కోరారు. అదేవిధంగా సంవత్సరం వారీగా ఎన్ని మందుల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారో, వాటిలో నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు.నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా వివరాలు ఇవ్వాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు. ముఖ్యంగా లైసెన్స్ సస్పెన్షన్, లైసెన్స్ రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలు తీసుకున్నారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు.దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు.తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా మరియు బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.నాణ్యతలో లోపాలు తేలినట్లయితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే ఆ మందులను వెనక్కి తీసుకుని కొత్త మందులు అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ-ఔషధి అనే డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని చెప్పారు. స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల మందుల కొరత, అక్రమాలు వంటి సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.