
ఈ69న్యూస్ ఐనవోలు:-మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒంటిమామిడిపల్లిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై పరిజ్ఞానం అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.నేటి డిజిటల్ యుగాన్ని దృష్టిలో ఉంచుకుని,ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించి,జిల్లాలోని ఐదు పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది.ఎంపిక చేసిన పాఠశాలల ఉపాధ్యాయులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి మరియు శిక్షణా కేంద్రం,హైదరాబాద్లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణను కూడా నిర్వహించారు.ఒంటిమామిడిపల్లి పాఠశాలలో ఇప్పటికే 30 కంప్యూటర్లతో కూడిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ ఉండటంతో, ఈ పాఠశాల ఎంపికైంది. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు గణితం, సైన్స్, ఆంగ్ల భాషలపై AI ఆధారిత ఉపాధి విధానాలతో మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మండల విద్యా శాఖ అధికారి శ్రీ పులి ఆనందం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ శ్రీ పెండ్లి నవీన్ గారు, వైస్ చైర్మన్ శ్రీ గోనె రాజు గారు, సభ్యులు శ్రీ కరుణాకర్, రాజు గారు, సలహాదారు శ్రీ మొహమ్మద్ రఫీ గారు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.పాఠశాల ప్రాధానోపాధ్యాయులు మంద సదానందం గారు, ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా సహకరించారు.విద్యార్థులు సాంకేతిక రంగంలో ముందంజ వేయడానికి, ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆవిశ్వాసం వ్యక్తమవుతోంది.