
జనగామ జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు సేవలందించిన రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు బదిలీ అయ్యారు. తన పదవీకాలంలో జనగామ జిల్లా పేరును రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన కలెక్టర్‌గా గుర్తింపు పొందారు.
విద్య, వైద్యం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం పర్యటనలు, సమీక్షలు నిర్వహించారు.
జాతీయ స్థాయి పురస్కారాలు
“మన జిల్లా – మన నీరు” అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి, వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2025 నవంబర్ 18న ఢిల్లీలో నిర్వహించిన 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్ చేతుల మీదుగా “జల్ సంచాయ్ – జన భాగీధారీ 1.0” అవార్డు, “జల్ ప్రహరీ సమ్మాన్” పురస్కారాలను అందుకున్నారు.
అలాగే సమాచార హక్కు చట్టం దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి ప్రతిభ కనబరిచినందుకు 2025 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా అవార్డును అందుకున్నారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సిబ్బంది నైపుణ్యాల పెంపులో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2026 జనవరి 25న అదే వేదికలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ జిల్లాగా మరోసారి పురస్కారం అందుకున్నారు.
విద్యారంగంలో విశిష్ట స్థానం
జాతీయ స్థాయి NAS–2024లో మూడో తరగతిలో 16వ స్థానం, ఆరో తరగతిలో 35వ స్థానం, 9వ తరగతిలో 33వ స్థానం సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా 2025 సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి నిరుపేదకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.