కాళేశ్వరంలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఘన విజయాన్ని నమోదు చేసింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ ఫలితం గ్రామ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.గ్రామంలోని ప్రతి వార్డు నుంచి బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతుగా ఓటు వేసినట్లు స్పష్టమైంది.ముఖ్యంగా గతంలో అమలైన పలు సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకత్వం చూపిన దృష్టి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఎన్నికల ప్రచారంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, పుష్కరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజల మద్దతు లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ హంగులు, ప్రచార ఆర్భాటం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ప్రజలు ఖర్చు, హడావుడికన్నా నమ్మకమైన నాయకత్వానికే పట్టం కట్టారని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది.విజయం సాధించిన అనంతరం వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, “ఈ గెలుపు నాది ఒక్కరిది కాదు. కాళేశ్వరం గ్రామ ప్రజలందరి విజయం. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరికి రుణపడి ఉంటాను. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చడమే నా లక్ష్యం” అని తెలిపారు.బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటూ, బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.ఈ విజయం రాబోయే రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.