
కార్మిక నేతలు ముక్కెర రామస్వామి, మాలోతు సాగర్ డిమాండ్
ఈ69న్యూస్, వరంగల్:దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా వరంగల్లోని రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్లింగ్ వర్కర్స్,స్టీల్ అల్మరా గుమాస్తాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కార్మిక నాయకులు ముక్కెర రామస్వామి, మాలోతు సాగర్ మాట్లాడుతూ — కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు.ఇది యజమానులకు,పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా రూపుదిద్దిన విధానం అని విమర్శించారు.ఈ మార్పుల వల్ల కార్మిక వర్గం బానిసత్వంలోకి నెట్టబడుతోందని,దేశంలోని కూలీల హక్కులు,భద్రతా పథకాలన్నీ తుడిచిపెట్టేలా ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.అదే విధంగా,తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.282పై కూడా నేతలు మండిపడ్డారు.ఈ జీవో ద్వారా కార్మికుల పని వేళలు రోజుకు 10 గంటలకు పెంచాలన్న ప్రతిపాదనను వారు పూర్తిగా తిరస్కరించారు.నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడాన్ని నాయకులు తప్పుబట్టారు.రోజువారీ కార్మికులు చాలీచాలని వేతనాలతో బ్రతుకుదెరువు సాగిస్తున్నారని,ఎన్నికల సమయంలో మాత్రమే వారిని గుర్తుపెట్టి తరువాత విస్మరిస్తారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి,పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.లేదంటే దేశవ్యాప్తంగా ఉగ్రంగా కార్మిక పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో తాటికాయల రత్నం,అందగట్ల రఘుపతి,గణిపాక ఓదేల్,కె.స్వప్న,యాకయ్య,శంకేసి రవి,తరాల కుమార్,లింగయ్య,ఇస్తారి భూస,ఎల్లయ్య,కొలిపాక స్వామి,ఆటో సంఘం నాయకులు రాజు,సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.