గణపురం–హైదరాబాద్ నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం
జిల్లా కలెక్టర్ ఎస్పీ లతో కలిసి బస్సు సర్వీసు ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గణపురం మండల కేంద్ర బస్ స్టేషన్లో గణపురం నుండి ములుగు మార్గంగా హైదరాబాద్కు నేరుగా నడిచే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్లతో కలిసి జెండా ఊపి సేవలను ప్రారంభించారు.ప్రారంభం అనంతరం అధికారులు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపురం మండల ప్రజల ఎన్నో ఏళ్లుగా ఉన్న రవాణా సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధానికి నేరుగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు అత్యవసర వైద్య అవసరాల కోసం వెళ్లే ప్రజలకు సమయం, ఖర్చు రెండింటిలోనూ ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ములుగు మార్గంగా ఈ బస్సు నడవడం వల్ల మార్గమధ్యంలోని గ్రామాల ప్రజలకు కూడా సౌకర్యవంతమైన అనుసంధానం లభిస్తుందని వివరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.సేవల సమయపాలన, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.గ్రామీణ–పట్టణ అనుసంధానం బలపడితే ఆర్థిక, విద్యా మరియు వైద్య రంగాల్లో ప్రజలకు మరింత అవకాశాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ సంకీర్త్ రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు.బస్సు సేవల వినియోగం పెరగడం ద్వారా ప్రజలకు సురక్షిత, నియంత్రిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందని తెలిపారు.ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం రవాణా రంగాన్ని బలోపేతం చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి ప్రత్యక్ష రవాణా సౌకర్యాలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రజలు కొత్త బస్సు సేవ ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు