గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపాలి
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
డీఆర్డీఓ పీడీ ఇన్చార్జి డీపీఓ వసంత,కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్‌కు వినతిపత్రం
-గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు గ్రామపంచాయతీ కార్మికులను కక్షపూరితంగా వేధించడం,అక్రమంగా తొలగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని,అలాగే పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్డీఓ పీడీ ఇన్చార్జి డీపీఓ వసంతకు,కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్‌కు వినతిపత్రాలు అందజేశారు.గ్రామపంచాయతీ సిబ్బందిని అక్రమంగా తొలగించే అధికారం ఎవరికి లేదని,కార్మికులపై వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఇన్చార్జి డీపీఓ వసంత హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ..జనగామ జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులను ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఇద్దరు సిబ్బందిని తొలగించాలని స్థానిక సర్పంచ్ చేసిన ఫిర్యాదు సరికాదని పేర్కొంటూ,ఆ ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని (జీవో నం.51) రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు.ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులను ఆన్లైన్లో నమోదు చేయకుండా నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు.గ్రామసభల తీర్మానాల ఆధారంగా నియమితులైన సిబ్బందిని అవసరం లేదని తొలగించే నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని సూచించారు.జిల్లాలో ఎక్కడైనా గ్రామపంచాయతీ సిబ్బందిని తొలగించే ప్రయత్నాలు జరిగితే యూనియన్ తరఫున అడ్డుకుంటామని హెచ్చరించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి,గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఆన్లైన్లో నమోదు కాని సిబ్బందిని వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే జిల్లాలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని,అదనపు కార్మికులకు జీపీల ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,డీపీఓలను కోరారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వ రామచందర్‌తో పాటు జిల్లా నేతలు మల్లాచారి,కొమరవెల్లి శ్రీనివాస్,నారోజు రామచంద్రం,ఉమ్మగోని రాజేష్,కరుణాకర్,సత్యనారాయణ,రాజ్‌కుమార్,బి.అఖిల్,సోమరాజ్,బిక్షపతి కొయ్యడ,నల్ల రాజయ్య,బాబు,శ్రీనివాస్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.