గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా–సర్పంచ్ చంద రమ రమేష్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కోనాయిచలం గ్రామ సర్పంచ్ చంద రమ రమేష్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.గ్రామంలో ఎన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.ముఖ్యంగా సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని,దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.అలాగే గ్రామంలోని బీటీ రోడ్లను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.వీధి లైట్ల కొరత కారణంగా రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి,ప్రతి వీధిలో సరిపడా లైట్లు ఏర్పాటు చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని హామీ ఇచ్చారు.తాగునీటి సమస్యలు పూర్తిగా లేకుండా చేసి,ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు చేపడతామని అన్నారు.అలాగే గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.గ్రామంలో మహిళా సంఘాలకు సొంత భవనం లేకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,త్వరలోనే మహిళా సంఘాల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు.గ్రామంలో శివాలయం లేకపోవడం పట్ల కూడా స్పందిస్తూ,ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వరంగల్ ఎంపీ కడియం కావ్యల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ చంద రమ పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని,ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు