ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. అజయ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఖమ్మంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం కెసిఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి హాజరై కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధులకు, పార్టీ కార్యకర్తలకు పంచారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోసి, కోట్లాది మంది ఆకాంక్షలకు స్వరూపం కల్పించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు నడిపి, తెలంగాణను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సాగునీటి రంగంలో కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన దూరదృష్టి గల నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్ రావు పువ్వాడ అజయ్ కుమార్ గారి వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవి కిరణ్, ఆరో డివిజన్ కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, నాలుగో డివిజన్ కార్పొరేటర్ దండ జ్యోతి రెడ్డి,23వ డివిజన్ కార్పొరేటర్ మాగబుల్,బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు వాంకుడోత్ సురేష్ నాయక్, రఘునాధపాలెం మండల అధ్యక్షులు అజ్మీర వీరు నాయక్, రఘునాధపాలెం మండల నాయకులు పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, నగర యువజన విభాగం త్రీ టౌన్ అధ్యక్షులు మాటేటి కిరణ్, నగర ప్రచార కార్యదర్శి సకిన, మహిళా విభాగం నాయకురాలు కొల్లు పద్మ,బీసీ సెల్ నాయకులు వీరేంద్ర గౌడ్, యువజన విభాగం నాయకులు కొమ్ము విజేత,తదితరులు పాల్గొన్నారు.