ఘనంగా భోగి–సంక్రాంతి–కనుమ వేడుకలు
చెంచుపల్లి గ్రామంలో భోగి,సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సంప్రదాయ సంస్కృతి, గ్రామీణ కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొని,మహిళలు, యువత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ముగ్గుల పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.పల్లె సంస్కృతి,వ్యవసాయ ప్రాధాన్యత,కుటుంబ ఐక్యతను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.తెల్లవారుజాము నుంచే గ్రామ వీధులు అందమైన ముగ్గులతో కళకళలాడాయి.పోటీల అనంతరం పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేసి నిర్వాహకులు ప్రోత్సహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జెల్ల రాము మాట్లాడుతూ,ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామీణ సంప్రదాయాలను కాపాడటంతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.భవిష్యత్తులో చెంచుపల్లి గ్రామంలో మరిన్ని సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాలు నిర్వహించి,అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కర్ణకంటి నరేష్, ఉప సర్పంచ్ ఇండ్ల భద్రమ్మ, వార్డు సభ్యులు నరేష్, లక్ష్మి, భద్రయ్య, చంద్రకళ,అలాగే యువత సరిత, రమ్యకృష్ణ, నర్మద, రాములు, రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామస్తుల సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వేడుకలు గ్రామంలో సంతోషం,ఐక్యతను పెంచాయని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు.