
ఈ69న్యూస్ జనగామ:దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపుపై జూలై 9న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా జనగామలో కార్మికులు ఐక్యంగా కదం తొక్కారు.ప్రిస్టియన్ గ్రౌండ్ నుంచి నెహ్రూ పార్కు వద్ద ఉన్న కామాక్షి ఫంక్షన్ హాల్ వరకూ సాగిన ర్యాలీ భారీ మానవ రద్దీతో,నినాదాలతో ఉత్సాహంగా కొనసాగింది.సీఐటీయూ,ఏఐటీయూసీ,బీఆర్టీయూ,ఐఎన్టీయూసీ,జాడు తదితర కార్మిక సంఘాల నాయకత్వంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్న ఈ మహా ప్రదర్శనలో లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే మోడీ గద్దె దిగాల్సిందే కార్మిక హక్కులపై దాడిని తిప్పికొడదాం వంటి నినాదాలు మార్మోగాయి.నాయకులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లు 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల రక్షణను కాలరాస్తున్నాయని, కార్మికులను కార్పొరేట్ బానిసలుగా మార్చే కుట్రగా దీన్ని అభివర్ణించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 282 ద్వారా రోజువారీ పని వేళను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు.కామాక్షి ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో కనీస వేతనం రూ.26,000,అసంఘటిత రంగ కార్మికులకు భద్రతా చట్టం,స్కీం వర్కర్ల రెగ్యులరైజేషన్,నెలకు రూ.9,000 పెన్షన్,కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు,బీఆర్టీయూ అధ్యక్షుడు వేముల నర్సింగం,ఏఐటీయూసీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సిహెచ్ రాజారెడ్డి,యాటల సోమన్న సహా పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభించింది.కార్మిక హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమని నేతలు ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.