జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాజర్ల అశోక్ దరఖాస్తు
వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేశారు.ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో (ఐతు పేరుతో) అగ్రనేతగా ఉన్న గాజర్ల అశోక్,అనారోగ్య కారణాల వల్ల ప్రజా జీవితంలోకి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా కొత్త దిశగా అడుగులు వేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ప్రేరణ పొందిన ఆయన,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి,ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.గత ఎన్నికల్లో ములుగు,పరకాల,భూపాలపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డారు.పరకాల టికెట్ కోసం బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ చివరికి ఆయనకు అవకాశం దక్కలేదు.ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గాజర్ల అశోక్ దరఖాస్తు చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.దరఖాస్తు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఆయన అన్నారు.నా ప్రియమైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,కార్యదర్శులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,స్థానిక జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరికీ సాదర వందనాలు.మీ ఆశీస్సులు,నిస్వార్థ సహకారం,మద్దతు నాకు లభిస్తే,పార్టీని గ్రామం నుండి రాష్ట్ర స్థాయికి బలపరచడానికి కృషి చేస్తాను.అదే విధంగా రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్య రక్షకుడిగా,సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని,ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో కొత్త ఉత్సాహం నిండిందని తెలిపారు.మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రేరణతో,పార్టీ కార్యకర్తల కృషికి గౌరవం ఇవ్వడం,వారికి తగిన అవకాశాలు కల్పించడం జరుగుతోంది.నేను కూడా అదే మార్గంలో సేవ చేయాలనుకుంటున్నాను అని గాజర్ల అశోక్ అన్నారు.తన రాజకీయ జీవనానికి దారినిర్దేశం చేసిన నాయకులుగా మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు(ఐటీ శాఖ)మరియు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్లు ప్రస్తావించారు.వారి ఆశీస్సులు,మార్గదర్శకత్వంతోనే జిల్లా అధ్యక్ష పదవికి ముందుకు వచ్చానని తెలిపారు.చివరిగా గాజర్ల అశోక్ ఈ విధంగా అన్నారు.భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి కార్యకర్త ఒకే దిశలో కృషి చేయాలి.మనం ఏకతా స్ఫూర్తితో ముందుకు సాగితే కాంగ్రెస్ జెండా గ్రామం నుండి రాష్ట్ర స్థాయికి ఎగురుతుంది.అందుకోసం మీ అందరి మద్దతు కోరుతున్నాను.ఇప్పుడు పార్టీ వర్గాల్లో ప్రశ్న ఒక్కటే-పరకాల టికెట్ దక్కనిది గాజర్ల అశోక్‌కు భూపాలపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయా? అనేది వేచి చూడాల్సిందే.