టెట్ మినహాయింపు కోరుతూ ఫిబ్రవరి 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్
సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయించాలని,ప్రభుత్వ విద్యకు నష్టం కలిగిస్తున్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని,పాఠశాలల మూసివేతలు మరియు విలీనాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో శుక్రవారం (9-1-2026) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఛాగల్‌లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ..సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి గానీ స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు.23 ఆగస్టు 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయడంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి విఫలమైందని ఆరోపించారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని,వేలాది పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.దీనివల్ల పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.విద్యా వ్యవస్థలో ఏర్పడిన ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పునఃసమీక్ష లేదా ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని,లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రపతి,ప్రధానమంత్రి లకు వినతిపత్రాలు పంపించాలని,ఫిబ్రవరి 5న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకొని పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఉపాధ్యాయ,విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం స్కూల్ ఉపాధ్యాయుల సమాఖ్య,మాధ్యమిక ఉపాధ్యాయుల సమాఖ్య,ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యలు కలిసి అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశాయని తెలిపారు.ఇందులో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య భాగస్వామ్య సంఘంగా ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.అంజిరెడ్డి,ఓ.పరమేశ్వరి,సీహెచ్.విజయ కుమారి,పి.లలిత కుమారి,ఎ.సోమరాజు,వై.వెంకటేష్,టి.వెంకటేశ్వర్లు,గాండ్ల శ్రీనివాస్, సీహెచ్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.