డ్రోన్ కెమెరాలతో కోడి పందాల గుర్తింపు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిషేధిత కోడి పందాలను అరికట్టేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘా చేపట్టారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కోడి పందాలపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పందాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు.
సత్తుపల్లి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ నిఘా బృందాలు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ, కోడి పందాలు జరుగుతున్న స్థావరాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నాయి. పండుగ రోజుల్లో అక్రమ జూద కార్యకలాపాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.
డ్రోన్ కెమెరాల ద్వారా కోడి పందాలు జరుగుతున్న ప్రాంతాలు, అక్కడ చేరుతున్న జనసమూహం, పందాల నిర్వాహకులను సులభంగా గుర్తించగలుగుతున్నామని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపారు. డ్రోన్ సాంకేతికతతో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వేగంగా స్పందించగలుగుతున్నామని అన్నారు.
కోడి పందాలు, పేకాట వంటి నిషేధిత కార్యకలాపాలను పూర్తిగా అరికట్టి శాంతిభద్రతలను కాపాడడమే పోలీసుల లక్ష్యమని తెలిపారు. డ్రోన్ నిఘా ద్వారా సేకరించిన సమాచారంతో దాడులు నిర్వహించి, పట్టుబడిన వారితో పాటు పందాలకు స్థలాలు కల్పించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు