స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్,నవంబర్ 04
నవంబర్ 2026 వరకు ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్,100పడకల ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫిస్ కాంప్లెక్స్,100పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను అధికారులు,కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు.నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పరిపాలన,వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.నవంబర్ 2026నాటికీ నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.భవనాలు నిర్మించడమే కాదు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.100పడకల ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు,మెడికల్,నాన్ మెడికల్ సిబ్బంది,ఇతర అవసరాలకు సంబందించిన జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యే నాటికీ అన్ని వసతులు,సౌకర్యాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.అధికారులు,కాంట్రాక్టర్లు ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమతో అడిగిన వెంటనే కాదనకుండా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గానికి 1400కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయని అందులో వివిధ పనులు ప్రారంభమై పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.1400కోట్ల అభివృద్ధి పనులను 18నెలలలో పూర్తి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలకు అనుమతులు వచ్చాయని,ఇంకా వేలేరు,చిల్పూర్ లలో మండల కార్యాలయాలు,కొన్ని రోడ్లకు అనుమతులు రావాల్సి ఉందని త్వరలోనే మంజూరు తీసుకువస్తానని తెలిపారు.కొంత మంది అభివృద్ధి పనులకు అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిలో కలిసి రావాలని,సహకారం అందించాలని కోరారు.కేటీఆర్ అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై,కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.కేటీఆర్ అహంభావంతో మాట్లాడటం సరికాదని సూచించారు.దేశానికే ఆదర్శవంతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని,200యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం పంపిణి,ఇందిరమ్మ ఇల్లు,21వేల కోట్ల రుణ మాఫీ, సన్నాలకు 500బోనస్ వంటి పథకాలు కేటీఆర్ కళ్ళకు కనిపించడం లేదని విమర్శించారు.ఉద్యమం చేసిన పార్టీ అని ప్రజలు రెండు సార్లు అధికారం ఇస్తే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపైన పడి దోచుకున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,ఆర్డివో వెంకన్న,మున్సిపాలిటీ కమీషనర్ రాధాకృష్ణ,ఎంపిడివో విజయశ్రీ,డాక్టర్ సంధ్యారాణి,వెంకటేశ్వర్ రెడ్డి,బెలిదె
వెంకన్న,సింగపురం వెంకటయ్య,గట్టు కోటి,జీడి రమేష్,సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.