నైతిక విలువలే మానవ జీవనానికి పునాది
వేదాలు,ఉపనిషత్తులు నుంచి ఖుర్ఆన్-మిర్జా గులాం అహ్మద్ రచనల వరకూ ఒకే నైతిక సందేశం
నైతికత పై ఈ69న్యూస్ లో ప్రత్యేక వార్తా కథనం
నైతిక విలువలు అనేవి మనిషి ఆలోచనలు,మాటలు,చర్యలను సరైన మార్గంలో నడిపించే మూల సూత్రాలు.నిజాయితీ,న్యాయం,కరుణ,ప్రేమ,సహనం,బాధ్యత,సేవాభావం వంటి గుణాలే వ్యక్తిని మంచివాడిగా,సమాజాన్ని శాంతియుతంగా నిలబెట్టే బలమైన పునాదులుగా పనిచేస్తాయి.నైతికత లేకుండా విద్య,సంపద,సాంకేతిక అభివృద్ధి ఉన్నా అవి సమాజానికి శాశ్వత ప్రయోజనం ఇవ్వవని మేధావులు అభిప్రాయపడుతున్నారు.నేటి సమాజంలో అవినీతి,హింస,ద్వేషం,స్వార్థం విస్తరిస్తున్న నేపథ్యంలో నైతిక విలువల అవసరం మరింతగా ముందుకు వచ్చింది.ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ప్రధాన మతగ్రంథాలన్నీ ఒకే స్వరంతో-నైతిక జీవనమే మానవ జీవితానికి పునాది అని బోధిస్తున్నాయని మత పండితులు పేర్కొంటున్నారు.
“వేదాలు-ఉపనిషత్తులు:సత్యం,ధర్మమే జీవన మార్గం”
వేదాలు నైతికతను ఋతం అనే సార్వత్రిక నియమంతో అనుసంధానించి బోధిస్తాయి.ఋగ్వేదంలోని“సత్యం వద,ధర్మం చర”అనే సూక్తి సత్యం పలకడం,ధర్మాన్ని ఆచరించడమే మనిషి ప్రధాన బాధ్యతగా నిర్దేశిస్తుంది.“ఏకం సత్ విప్రాః బహుధా వదంతి”అనే వాక్యం మత సహనం,పరస్పర గౌరవానికి బలమైన పునాదిని వేస్తుంది.ఉపనిషత్తులు నైతికతను అంతరాత్మ పరివర్తనగా విశ్లేషిస్తాయి.తైత్తిరీయ ఉపనిషత్తులోని“మాతృదేవో భవ,పితృదేవో భవ,అతిథిదేవో భవ”అనే ఉపదేశాలు సామాజిక బాధ్యతలను గుర్తు చేస్తాయి.
“పురాణాలు-భగవద్గీత:ధర్మం,కర్తవ్యమే సమాజ స్థిరత్వం”
పురాణాలలో ధర్మాన్నే అత్యున్నత నైతిక సూత్రంగా పేర్కొన్నారు.మహాభారతంలోని“ధర్మో రక్షతి రక్షితః”అనే వాక్యం ధర్మాన్ని కాపాడితే అదే సమాజాన్ని కాపాడుతుందని స్పష్టం చేస్తుంది.భగవద్గీతలో“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”అనే శ్లోకం ఫలితాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన నైతికత అని బోధిస్తుంది.
“బైబిల్:ప్రేమ,క్షమ,కరుణే నైతిక జీవితం”
బైబిల్లో ప్రేమనే నైతికతకు కేంద్రంగా ఉంచారు.“నీ పొరుగువానిని నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ప్రేమించుము”అనే బోధన ఇతరుల పట్ల గౌరవం,సహనం,క్షమాభావాన్ని అలవర్చుకోవాలని సూచిస్తుంది.
“ఖుర్ఆన్-ఇస్లాం తత్వం:న్యాయం,మంచి ప్రవర్తనే విశ్వాసం”
ఖుర్ఆన్లో నైతిక విలువలకు విశాల స్థానం ఉంది.“నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేయడాన్ని,ఉపకారం చేయడాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు”(16:90)
అనే ఆయత్ సామాజిక నైతిక వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తుంది.ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)చెప్పిన“మీలో ఉత్తముడు మంచి నైతిక గుణాలు కలిగినవాడే”అనే హదీస్ మంచి ప్రవర్తనే నిజమైన విశ్వాసమని స్పష్టం చేస్తుంది.
“మిర్జా గులాం అహ్మద్ రచనలు”
మత లక్ష్యం నైతిక సంస్కరణ
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్(అలైహిస్సలాం)తన రచనల ద్వారా మతం యొక్క అసలైన లక్ష్యం మానవునిలో నైతిక పరివర్తన తీసుకురావడమేనని స్పష్టంగా వివరించారు.ఆయన రచించిన “ఇస్లాం తత్వ జ్ఞానం”“కిష్తీ-నూహ్ (నోవహు నౌక)”గ్రంథంలో అబద్ధం,ద్వేషం,అహంకారం,హింస వంటి నైతిక లోపాలే మానవ వినాశనానికి మూలకారణాలని పేర్కొన్నారు.సత్యం,వినయం,కరుణ,సహనం వంటి గుణాలే మానవుణ్ని రక్షించే నిజమైన రక్షణ నౌక అని ఆయన బలంగా ఉద్ఘాటించారు.అలాగే“బరాహీన్-ఎ-అహ్మదీయా”గ్రంథంలో మతం యొక్క లక్ష్యం కేవలం ఆచారాలు లేదా వాదనలు కాదని,మనిషిని నైతికంగా శుద్ధి చేయడమే అసలైన ధర్మమని వివరించారు.దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు మనిషిలో సహజంగానే సత్యనిష్ఠ,న్యాయం,మానవతా విలువలు వికసిస్తాయని ఆయన స్పష్టం చేశారు.మిర్జా గులాం అహ్మద్,నైతికత లేని ఆధ్యాత్మికత శూన్యమని పలుమార్లు హెచ్చరించారు.మంచి ప్రవర్తన లేకుండా మతాచరణ అర్థరహితమవుతుందని ఆయన రచనల సారాంశం.మతాల ఏకస్వర సందేశం
వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలు,భగవద్గీత,బైబిల్,ఖుర్ఆన్,అలాగే మిర్జా గులాం అహ్మద్ రచనలు-ఈ అన్ని గ్రంథాలూ ఒకే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి.మతం లక్ష్యం మానవునిలో నైతిక పరివర్తన
మంచి ప్రవర్తనే నిజమైన ఆధ్యాత్మికత,నేటి ప్రపంచంలో శాంతి,సోదరభావం,సమానత్వం నెలకొల్పాలంటే మతగ్రంథాలు బోధించిన నైతిక విలువలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని మత పండితులు స్పష్టం చేస్తున్నారు.
(వ్యాసకర్త:ముహమ్మద్ సలీం ఈ69న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో)