పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో పరిశుభ్రమైన పరిసరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మరిపెడ పట్టణంలోని ఆరో వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన వాహనంలో వేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను మురికి కాలువ నీటికి అడ్డుగా వేయకూడదని అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన మరిపెడ పట్టణం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.అనంతరం మున్సిపల్ అధికారులతో కలసి కార్గిల్ సెంటర్ నుండి రాజీవ్ గాంధీ సెంటర్ వరకు పట్టణంలో స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సునీత రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు మెరుగు రాము,సురేష్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, కాలం శ్రీనివాస రెడ్డి,బోడ రవి,లచ్చిరామ్, చరణ్ సింగ్,తాడురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.