పార్లమెంటులో డ్రామాలు వద్దు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. సభలో నినాదాలు, అడ్డంకులు, డ్రామాలకు స్థానంలేదని, దేశ అభివృద్ధి కోసం విధాన చర్చలపైనే దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంటులో మీడియాతో మాట్లాడిన మోదీ, “డ్రామాలు చేయడానికి దేశంలో అనేక వేదికలు ఉన్నాయి. కానీ పార్లమెంట్ మాత్రం విధానాల రూపకల్పనకు పరిమితం కావాలి. ఇక్కడ జరగాల్సింది ‘డెలివరీ’ – ఫలితాలు” అని కఠినంగా వ్యాఖ్యానించారు.
విపక్షాలపై మోదీ విమర్శలు
తాజా ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి విపక్షాలు బయటపడలేకపోతున్నాయని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో రాజకీయ అడ్డంకులు సృష్టించడం బాధాకరమని ప్రధాని ఎద్దేవా చేశారు.ఎన్నికలు ముగిసినా, విపక్షాల మాటల్లో ఇంకా ఓటమి బాధ స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన అన్నారు.
యువ ఎంపీలకు అవకాశమివ్వాలని పిలుపు
సభలో కొత్తగా ఎన్నికైన, యువ ఎంపీలు మాట్లాడే అవకాశం పొందడంలేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.తొలిసారి వచ్చిన ఎంపీలు తమ ప్రాంత సమస్యలు చెప్పడానికి కూడా అవకాశమివ్వడం లేదు. వారికి అవకాశమివ్వడం మనందరి బాధ్యత అని మోదీ వివరించారు.
భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచం గమనిస్తోంది
బీహార్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావడం, ముఖ్యంగా మహిళల పాల్గొనడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని అన్నారు.ప్రపంచం భారత్ ప్రజాస్వామ్య బలం, ఆర్థిక ప్రగతిని నిశితంగా గమనిస్తోంది అని పేర్కొన్నారు.
రాష్ట్రాల్లో విపక్ష పార్టీలపై వ్యాఖ్యలు
కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజా వ్యతిరేకత కారణంగా తమ రాష్ట్రాల్లో పర్యటించలేని స్థితికి చేరుకున్నాయని మోదీ విమర్శించారు. రాజకీయాల్లో నెగిటివిటీతో కాకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా కొత్తగా రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సి.పి. రాధాకృష్ణన్ కు ఆయన అభినందనలు తెలిపారు