పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఆలస్యం కావడం వల్ల జిల్లాలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రదాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాల నిధులను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి పెట్టుబడి ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సాయం ఆలస్యమైతే సాగు పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సన్మాన్ నిధి మొత్తాన్ని రూ.10,000లకు పెంచి, ప్రతి విడతను ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో పెండింగ్ చెల్లింపులను వెంటనే పూర్తి చేసి, సకాలంలో నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం అందకపోవడం వల్ల రైతులు అప్పులపాలవుతూ, సాగు పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని, దేశవ్యాప్తంగా రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు.కిసాన్ సన్మాన్ నిధి, రైతుబంధు నిధుల విడుదల కోసం రైతాంగం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని భూక్య చందు నాయక్ పిలుపునిచ్చారు.