పేకాట గుట్టురట్టు
9 మంది అదుపులోకి – నగదు, వాహనాల స్వాధీనం స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి క్రాస్‌రోడ్డు రిజర్వాయర్ సమీప మామిడి తోటలో రహస్యంగా కొనసాగుతున్న పేకాట ఆటను పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.పోలీసులను గమనించిన పేకాట రాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించగా, ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే పట్టుబడ్డారు.మిగిలిన వారిని పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలో మొత్తం తొమ్మిది మంది అరెస్టు అయ్యారు.సీఐ జి. వేణు వెల్లడించిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి పేకాటకు ఉపయోగించిన రూ.4,220 నగదు మరియు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారంతా స్థానికులేనని తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఐ హెచ్చరించారు. దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అభినందించారు.