పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాల సమయంలో పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన 57 మంది లబ్ధిదారులకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, అలాగే వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సామాజిక సమానత్వాన్ని సాధించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో శాయంపేట మండలంలో మరిన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.అంతకుముందు మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు