పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్ నుండి పై మండలాల ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు జరిగే పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియ, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్లు, గ్రామపంచాయతీ వారీగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, బడ్జెట్ తదితర అంశాలపై భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ ఎంపీడీవోలు వీరేశం, విజయ్ కుమార్, బాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ నెల 10న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద కౌంటర్లు, టెంట్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, 11న పోలింగ్ కేంద్రాలలో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద టీవోటీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, చెక్లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ను సరిచూసుకోవాలని ఆదేశించారు.
శిక్షణకు హాజరుకాకపోయిన ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు.భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు కేటాయించిన కొందరు ప్రిసైడింగ్ అధికారులు శిక్షణకు గైర్హాజరైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఏ మేనేజర్ శ్రీను, జడ్పీ సీఈవో రవి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల ప్రత్యేక అధికారులు అనసూయ, శ్రీనివాసులు, నరసింహస్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.