
ఈ69న్యూస్ హనుమకొండ, మార్చి 16
జిల్లాలో అమలవుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాల పురోగతిపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం సమీక్ష నిర్వహించారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు (డీఎల్పీఓలు) రవిబాబు, గంగభవానితో గ్రామపంచాయతీలకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీలలో పన్నుల వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయాలకు పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలలోపు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రామపంచాయతీలలో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి వంద శాతం పన్నులు సేకరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.