"సేవ్ హైదరాబాద్" నినాదంతో భారీ మానవహారం
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్, జూన్ 5
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హెచ్‌సీఎఫ్) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై “సేవ్ హైదరాబాద్” నినాదంతో భారీ మానవహారం నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నగరాభివృద్ధిలో స్థిరమైన విధానాల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, విద్యావేత్త కె. నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగరీకరణ వేగంగా పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు ఇస్తున్న ప్రాధాన్యతను “ఈజ్ ఆఫ్ లివింగ్”కు కూడా ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించేలా నగరాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాల్లో గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చే విధంగా నిర్మాణాలు చేపట్టాలని, తద్వారా విద్యుత్ వినియోగం తగ్గించవచ్చని తెలిపారు.ప్రజా రవాణా, మొబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.భూగర్భ జలాలు, గాలి, నీటి వనరులు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని, డ్రైనేజీ నీటిని చెరువులు, జలాశయాల్లోకి వదలడం వల్ల మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.హుస్సేన్ సాగర్, మూసీ నది శుద్ధి కార్యక్రమాల గురించి ఎన్నో ఏళ్లుగా వింటున్నప్పటికీ వాటి అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. నగరాభివృద్ధి పర్యావరణ హితంగా ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక వ్యవస్థకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (యూడీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వంద మందికి కనీసం 100 చెట్లు ఉండాలని సూచించారు.అయితే హైదరాబాద్‌లో చెట్ల సంఖ్య తగిన స్థాయిలో లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. ప్రతి సంవత్సరం నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం కాలుష్య తీవ్రతను సూచిస్తోందని పేర్కొన్నారు. అర్బన్ ప్లానింగ్‌లో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వాలతో పాటు పౌరసంఘాలు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు.హెచ్‌సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ వార్మింగ్ నివారణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, హుస్సేన్ సాగర్-మూసీ శుద్ధి, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ఆకర్షణీయ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఆర్. మాణిక్తో పాటు హెచ్‌సీఎఫ్ కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, పౌరసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.