ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమంపై రాజీ లేదు
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అధికారులు
హాస్టళ్లలో నాణ్యమైన భోజనం తప్పనిసరి.. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
మంగపేట సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు.. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు బుధవారం మంగపేట మండలంలోని చుంచుపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకయ్య, డీపీవో వెంకటయ్య, మండల స్పెషల్ ఆఫీసర్, సంబంధిత అధికారులు, స్థానిక మాజీ ఎంపీటీసీ బొచ్చు వెంకన్నతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్కు సంబంధించిన హాజరు పట్టికలు, ఆహార నిల్వలు, మెస్ నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, వసతి గదుల పరిస్థితి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా పరిశీలించిన గుమ్మడి సోమయ్య, విద్యార్థినులతో కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేశారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యత. వారికి అందించే ఆహారం నాణ్యంగా, పౌష్టికాహారంతో ఉండాలి. వసతుల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. వార్డెన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భోజన నాణ్యత, పరిశుభ్రత లేదా నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. విద్యార్థులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు కూడా అదే బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా, మండల స్థాయి అధికారులు, సంక్షేమ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.