భద్రాచలంలో శంకర్‌దాదా ఎంబీబీఎస్
- ఫేక్ పట్టాతో ప్రజల ప్రాణాలతో చలగాటం
- ఏజెన్సీలో అమాయక ప్రజలే టార్గెట్‌గా దందా..
- ఏడాదిగా ఆయుషీ నర్సింగ్ హోం పేరుతో నిర్వాకం
- ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఇంతకాలం గుర్తించని అధికారులు..!?
- ఐఎంఏ ఫిర్యాదుతో బట్టబయలైన నకిలీ డాక్టర్ బాగోతం
- ఆస్పత్రి సీజ్.. పోలీసులకు ఫిర్యాదు..
- జిల్లాలో ఇంకెంత మంది ఘనులు ఉన్నారోనన్న చర్చ
- భద్రాచలంలో శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా తరహాలో వైద్యం చేస్తున్న ఓ ఘనుడి బాగోతం బట్టబయలైంది. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అవతారం ఎత్తి పట్టణ నడిబొడ్డున హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు ఆ నకిలీ వైద్యుడు. ఆయుషీ నర్సింగ్ హోం పేరుతో కన్సల్టెంట్ వైద్యులతో హాస్పటల్ ఏర్పాటు చేసి ఏజెన్సీలో అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకుని ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడం, చిక్సితలు చేయడం వంటి తతంగాన్ని నడిపించాడు. చివరికి ఐఎంఏ వైద్యులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భద్రాచలం ప్రాంత వాసులు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఇందుకు సంబంధించి అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
- రాజశేఖర్ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్ డాక్టర్ అని, పలువురు కన్సల్టింగ్ వైద్యులతో ఆయుషీ నర్సింగ్ హోం హాస్పిటల్ పెట్టడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ఏడాది కాలంగా ఆ ఆస్పత్రిలో వైద్య సేవలు సైతం అందిస్తున్నాడు. దీంతో అమాయక గిరిజన ప్రజలు వైద్యం చేయించుకునేవారు. అతడు కూడా వచ్చిన వారిని పరీక్షించడం, మందులు ఇవ్వడం, చికిత్సలు చేయడం వంటివి చేస్తున్నాడు. ఈ తరుణంలోనే, రాజశేఖర్ ఎంబిబిఎస్ సర్టిఫికెట్‌పై భద్రాచలం పట్టణంలోని ఐఎంఏ డాక్టర్స్‌కు అనుమానం వచ్చింది. అతనిపై ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారితో పాటు డిఎంఅండ్హెచఓకి ఫిర్యాదు చేశారు. దీంతో పిఓ రాహుల్ ఆదేశాల మేరకు బుధవారం ఏడిఎం అండ్ హెచఓ డాక్టర్ సైదులు, ఐఎంఏ వైద్యులు డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు ఆయుషి పేరుతో నడుపుతున్న ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేస్తున్న రాజశేఖర్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఫేక్ అని గుర్తించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పట్టణంలో నకిలీ వైద్యుడు బాగోతం బయటపడటంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
- అధికారుల నిర్లక్ష్యమా..!? మామూళ్లకు నిదర్శనమా..!?
- ఫేక్ సర్టిఫికెట్తో ఆస్పత్రికి అనుమతి పొంది ఏడాది కాలంగా వైద్యం చేస్తున్న రాజశేఖర్ వ్యవహారం అధికారుల నిర్లక్ష్యమా..? లేక మామూళ్లకు నిదర్శనమా ? అన్న చర్చ ఇప్ప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏజెన్సీ ప్రాంతంలోని పేద, అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని చికిత్సల పేరుతో ఫీజులు దండుకోవడానికి సరైన వైద్య అర్హతలు లేకుండానే ఇంతకాలం వైద్యుడిగా చలామణి అవుతున్నా.. అధికారులు గుర్తించకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐఎంఏ ప్రతినిధులు ఫిర్యాదు చేస్తేకానీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తనిఖీల పేరుతో హడావుడి చేసే వైద్యారోగ్య శాఖాధికారులకు ఏడాది కాలంగా ఈ విషయం తెలియకుండా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పట్టణ వాసులు. అయితే రాజశేఖర్ లాంటి వారు జిల్లాలో ఇంకా ఎంత మంది ఉన్నారు..? అనుమతులు ఉన్న ఆస్పత్రులు ఎన్ని..? జిల్లాలో అసలు ఎన్ని ఉన్నాయి..? అన్న చర్చ ఇప్ప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి నకిలీ వైద్యుల బాగోతం బట్టబయలు చేయాలని కోరుతున్నారు. కాగా భద్రాచలం ఐఎంఏ వైద్యులు నకిలీ డాక్టర్ గుర్తించి సీజ్ చేయించడం పట్ల భద్రాచలం ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.