భూపాలపల్లిలో బీఆర్ఎస్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణతో పాటు సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చకు వచ్చాయి. ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ఆశలను నిరాశపరుస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వారి హక్కుల పరిరక్షణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొనగా, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే సంకల్పాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు