అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు

ఈ69న్యూస్ వరంగల్
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి నుండి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.వీధులు,కాలనీలు,తక్కువ ఎత్తులో ఉన్న ఇళ్లు వరద నీటితో నిండిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షపు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితిని సమీక్షించిన మిల్స్ కాలనీ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,వాహనదారులను ప్రమాద ప్రాంతాల నుంచి మళ్లించడం,నీటిలో ఇరుక్కున్నవారికి సహాయం అందించడం వంటి చర్యలు చేపట్టారు.ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు.అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.వర్షం,వరద నీరు పూర్తిగా తగ్గేవరకు జాగ్రత్తలు పాటించాలని,విద్యుత్ పరికరాలు,బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోలీసులు,మునిసిపల్ సిబ్బంది మరియు స్థానిక స్వచ్ఛంద సేవకులు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తూ,పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు నిరంతర పహారా వేస్తున్నారు.