మైక్రో అబ్జర్వర్లు కీలక పాత్ర పోషించాలి
గ్రామ పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యుల సాధారణ ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛాయుత,నిస్పక్షపాత మరియు పారదర్శక వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు రవికిరణ్,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.శనివారం జనగాం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ రవికిరణ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మార్గనిర్దేశనం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.ఎలాంటి పక్షపాతం లేకుండా నైతిక విలువలతో విధులు నిర్వర్తించాలని సూచించారు.మైక్రో అబ్జర్వర్లు తమ చెక్‌లిస్ట్‌లో ప్రతి అంశాన్ని“అవును/కాదు”రూపంలో నమోదు చేసి,ఏవైనా లోపాలు లేదా సంఘటనలు గమనిస్తే ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయాలన్నారు.పోలింగ్ స్టేషన్లో బ్యాలట్ బాక్స్‌ను సరిగ్గా ఫిక్స్ చేయాలని,ఎంట్రీ పాస్ సిస్టమ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఓటర్ల గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జరగాలని,ఇండెలిబుల్ ఇంక్ సరైన విధంగా అప్లై చేయాలని,బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌లో ఓటర్ల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.పోలింగ్‌లో రహస్యత్వం పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలని ఆదేశించారు.పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తనపై నిఘా ఉంచాలని,వారి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ కౌంటింగ్ సెంటర్స్‌లో ఏర్పాట్లు పరిశీలించి, కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. ఫలితాల ప్రకటన,ఎన్నికల సర్టిఫికెట్ల జారీ సక్రమంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ రవికిరణ్ మాట్లాడుతూ..పోలింగ్ ఏజెంట్ల హాజరు,కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.పోలింగ్ స్టేషన్లలో అనవసర రద్దీ లేకుండా యాక్సెస్ నియంత్రణ చేపట్టాలని,కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా జరిపి, వీడియో రికార్డింగ్, ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.ఫలితాల అనంతరం నిర్వహించే ఉపసర్పంచ్ ఎన్నికను తెలంగాణ పంచాయతీ రాజ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా పోలింగ్ టీమ్‌లతో కలిసి సమయానికి పోలింగ్ స్టేషన్లు, రిసెప్షన్ సెంటర్లకు చేరుకోవాలని తెలిపారు.పోలింగ్ స్టేషన్లో అవసరమైన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి ధృవీకరించాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మైక్రో అబ్జర్వర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.శిక్షణలో మాస్టర్ ట్రైనర్ మెరుగు రామరాజు మైక్రో అబ్జర్వర్లకు బ్యాలట్ బాక్స్ పరిశీలన,సీరియల్ నంబర్ల నమోదు,మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ తయారీ,పోలింగ్ కేంద్ర ప్రవేశ నియంత్రణ,ఓటర్ల గుర్తింపు,ఇండెలిబుల్ సిరా అప్లై చేయడం,ఓటర్ల నమోదు ప్రక్రియలు,వికలాంగులు,వృద్ధులకు సహాయం,పోలింగ్ కేంద్రాల చుట్టూ అనుచిత ప్రచారం లేదా ఒత్తిడులపై నిఘా వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.పోలింగ్ సమయంలో ఏవైనా అంతరాయాలు,ఘర్షణలు,ఫిర్యాదులు వచ్చినపుడు వాటిని వెంటనే జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లే విధానం,పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలట్ బాక్స్ సీలింగ్,ఎన్నికల సామగ్రి రవాణా,బ్యాలెట్ పేపర్ అకౌంట్ తయారీ,ఏజెంట్లకు కాపీల పంపిణీ అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు.కౌంటింగ్ సమయంలో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ బాధ్యతలు, ఫలిత పత్రాల సిద్ధతపై మార్గదర్శకాలు అందించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మాధురి షా,ఇంచార్జ్ డీపీఓ వసంతతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.