నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనారిటీ నివాస పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం భారత్ రాష్ట్ర సమితి, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడి విద్యాభ్యాసం,వసతి,భోజనం, మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ నివాస పాఠశాలలో పరిశుభ్రత లోపించిందని,భవనం గోడలకు విద్యుత్ దీపాలు,రంగులు,గోడల పగుళ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు సరైన శౌచాలయాలు,తరగతి గదుల్లో విద్యుత్ పంకాలు,దీపాలు ఏర్పాటు చేయాలని,ప్రత్యేకంగా చదువుకోవడానికి ఒక పఠన మందిరాన్ని (రీడింగ్ హాల్) అందుబాటులోకి తేవలసిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరారు.వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పిచికారీ,క్రిమిసంహారక పొడి చల్లడం వంటి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.