
ప్రపంచంలోని అనేక మతాలు, సంప్రదాయాలలో ఉపవాస వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును నియంత్రించుకోవడం, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, దేవుని పట్ల భక్తిని బలపరచడం వంటి లక్ష్యాలతో ఉపవాసాన్ని ఆచరించే సంప్రదాయం మనిషి నాగరికతలో ఎంతో పురాతనమైనది. ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు ఈ ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలం రంజాన్ మాసం.సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర నెలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో గడుపుతారు. బక్రీద్ వంటి పండుగలు ఉన్నప్పటికీ ముస్లింలకు ఆధ్యాత్మికంగా అత్యంత గొప్పదైన నెల రంజానే.
రంజాన్ మాసం ప్రత్యేకత ప్రధానంగా రోజా (ఉపవాసం) ఆచరణలో కనిపిస్తుంది. ఈ నెలలో ముస్లింలు సుమారు ముప్పై రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడతారు.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహారం లేదా పానీయాలు తీసుకోకుండా కఠిన నియమాలతో రోజాను పాటిస్తారు.సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారాన్ని సహ్రి అని, సూర్యాస్తమయం అనంతరం ఉపవాసాన్ని విరమించే సమయాన్ని ఇఫ్తార్ అని పిలుస్తారు.రోజా కేవలం ఆకలి దాహాలను నియంత్రించడం మాత్రమే కాదు; అది మనసు, మాట, ప్రవర్తనలలో కూడా నియంత్రణను కలిగించే ఆధ్యాత్మిక సాధన. ఈ సమయంలో ముస్లింలు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి, దేవుని ధ్యానంలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.
ఇస్లాం మత విశ్వాసం ప్రకారం పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ రంజాన్ మాసంలోనే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిపై అవతరింపజేయబడింది.అందువల్ల ఈ నెలలో ఖురాన్ పఠనానికి, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.రోజువారీ ఐదు నమాజ్లతో పాటు రాత్రివేళ ప్రత్యేకంగా చేసే తరావీహ్ నమాజ్ రంజాన్ మాసానికి మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది. మసీదులు ప్రార్థనలతో నిండిపోతాయి.భక్తులు పెద్ద సంఖ్యలో మసీదులకు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంటారు.
రంజాన్ మాసం ముస్లింలలో దానధర్మాల పట్ల చైతన్యాన్ని పెంపొందించే కాలం కూడా. ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని నిరుపేదలకు దానం చేయడం జకాత్ అని పిలుస్తారు.సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం, పేదలకు సహాయం చేయడం, మానవతా భావాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. జకాత్ రూపంలో పేదలకు ఆహారం, దుస్తులు, నగదు వంటి సహాయాలు అందించడం ద్వారా వారికి సహాయహస్తం అందిస్తారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లింలు విరివిగా దానధర్మాలు చేస్తారు.
రంజాన్ నెలలో మరో ప్రత్యేక ఆచారం ఇతికాఫ్. సాధారణంగా నెలలో చివరి పది రోజులలో కొందరు భక్తులు మసీదులోనే ఉండి ఆధ్యాత్మిక ధ్యానంలో గడుపుతారు. ఈ సమయంలో వారు ప్రార్థనలు చేస్తూ, ఖురాన్ పఠనం చేస్తూ, ప్రపంచ వ్యాపారాల నుండి దూరంగా ఉండి పూర్తిగా దేవుని సేవలో నిమగ్నమవుతారు. ఇది ఆత్మశుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా భావించబడుతుంది.
రంజాన్ మాసం చివరలో జరుపుకునే పర్వదినం ఈద్-ఉల్-ఫితర్. ఈ పండుగకు ముందు ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఫిత్రానా ఇవ్వాలి.సాధారణంగా గోధుమలు, ధాన్యాలు లేదా వాటికి సమానమైన నగదు రూపంలో ఈ దానాన్ని నిరుపేదలకు అందిస్తారు. దీని ద్వారా పేదలు కూడా పండుగ ఆనందాన్ని అనుభవించగలుగుతారు.సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే భావనను ఈ ఆచారం ప్రతిబింబిస్తుంది.అలాగే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆహారం తీసుకుంటారు. ఇఫ్తార్ విందులను ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు కూడా ఏర్పాటు చేసి ఉపవాసదారులకు అందించడం సాధారణంగా కనిపించే విషయం. ఈ విధంగా సామాజిక ఐక్యత, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం మరింత బలపడుతుంది.
మొత్తానికి రంజాన్ మాసం కేవలం ఉపవాసాల సమయం మాత్రమే కాదు.అది మనిషిలో భక్తి, క్రమశిక్షణ, దానగుణం, సహనం, సమానత్వం మరియు మానవతా విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక పర్వం. ఆకలి దాహాలను అనుభవించడం ద్వారా పేదల కష్టాలను అర్థం చేసుకోవడం, సమాజంలో సహానుభూతిని పెంపొందించడం ఈ ఉపవాసాల ప్రధాన సందేశం.మానవత్వం, దయ, పరస్పర సహకారం వంటి విలువలను పెంపొందించే ఈ పవిత్ర కాలం ముస్లింలకు మాత్రమే కాదు, సమాజానికి మొత్తం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భక్తి భావంతో ఆచరిస్తారు.చివరగా ఈద్ పండుగను ఆనందంగా జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు.ఆధ్యాత్మికత, మానవతా భావం, సౌభ్రాతృత్వం కలిసిన ఈ రంజాన్ మాసం సమాజంలో శాంతి, ప్రేమ, ఐక్యతను పెంపొందించే పవిత్ర పర్వంగా నిలుస్తుంది.
-ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా, అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్ర ప్రదేశ్