రెండో పంటకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించాలి
నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష
జిల్లాలో రెండో పంటకు ఒక్క ఎకరం కూడా సాగు నీరు అందక ఎండిపోకూడదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.అందుకు అనుగుణంగా నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి చిట్టచివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అన్ని రిజర్వాయర్ల నుండి వెళ్లే ప్రధాన కాలువలు,పంపిణీ కాలువలలో (డిస్ట్రిబ్యూటరీలు) జంగిల్ క్లియరెన్స్, ఇతర అడ్డంకులు ఉన్నాయా లేదా పరిశీలించి తొలగించాలని,అలాగే రిజర్వాయర్ల వద్ద గేట్లను సక్రమంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి విడుదల చేపట్టాలని,దానికి అనుగుణంగా వాటర్ పంపింగ్ నిర్వహించి రిజర్వాయర్లలో తగిన నీటి మట్టాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,యూరియా యాప్ వినియోగంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.పంట వేసిన రైతులకే యూరియా అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని,రైతులు నానో యూరియా వినియోగించేలా ప్రోత్సహించాలని అన్నారు.పంటకు అవసరమైన మేరకే యూరియా వినియోగించాలని,అధిక మోతాదులో యూరియా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను రైతులకు వివరించాలని తెలిపారు.పూర్తి స్థాయిలో సాగు నీరు,రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచడమే మన లక్ష్యం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
“ప్రతి ఎకరాకు నిర్ణీత కాలంలో సాగు నీరు అందించాలి”–జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత కాలంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ పరిధి,క్లస్టర్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ యూరియా యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ఆన్లైన్ విధానంతో పాటు,ప్రతి ఎరువుల దుకాణంలో బుకింగ్ ఐడీ వివరాలతో భౌతిక రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీర్,సూపరింటెండింగ్ ఇంజనీర్,డివిజనల్ ఇంజనీర్లు,వ్యవసాయ శాఖ అదనపు వ్యవసాయ సంచాలకులు,వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.