బర్ కోడ్స్,విత్తన,విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకు జిల్లా జాత
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్,బీబీ రామ్జీ (ఉపాధి హామీ) చట్టం మార్పులు,జాతీయ విత్తన బిల్లు,విద్యుత్ సవరణ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ,తెలంగాణ రైతు సంఘం,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జిల్లా జాతను సీఐటీయూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ (కారల్ మార్క్స్ కాలనీ) నుంచి ప్రారంభమైన ఈ జాత ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని 10 మండలాలు,343 గ్రామాలు, 302 కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతుందని ఆయన తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక,రైతు,వ్యవసాయ కూలీ వ్యతిరేక చట్టాలపై ప్రజలను చైతన్యం చేయడమే ఈ జాత లక్ష్యమని చెప్పారు.ఈ సందర్భంగా బందు సాయిలు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు అనుకూలంగా,కార్మికులకు నష్టంగా అమలు చేస్తోందని ఆరోపించారు.దీని వల్ల కనీస వేతనాలు తగ్గడం,12 గంటల పని విధానం,ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు,లేబర్ అధికారాల తగ్గింపు వంటి చర్యలతో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుందన్నారు.నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే వామపక్షాల పాలనలో తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచి బీబీ రామ్జీ చట్టంగా మార్చడం వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.ఏడాదికి 200 రోజుల పని,రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని కోరారు.కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన జాతీయ విత్తన బిల్లును తక్షణమే రద్దు చేయాలని,ఇది రైతాంగానికి నష్టకరమని తెలిపారు.అలాగే విద్యుత్ సవరణ చట్టం–2025 ద్వారా విద్యుత్ ఉత్పత్తి,సరఫరా,పంపిణీ బాధ్యతలను కేంద్రం తన చేతిలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాల హక్కులు హరించబడతాయని విమర్శించారు.స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతారని,ఉచిత విద్యుత్,రైతులకు ఇచ్చే సబ్సిడీలు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు.ఈ చట్టాలన్నింటిని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ జాతలు కొనసాగుతాయని,జనవరి 11న జిల్లా కేంద్రంలో జాత ముగింపు,అలాగే జనవరి 19న జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ జాతకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్మకూరు శ్రీకాంత్ నాయకత్వం వహించారు.ఈ కార్యక్రమంలో బి. క్రాంతి, ఎం. రాజేందర్, సిహెచ్. రవికుమార్, మహేందర్, కె. రవికుమార్, జాడి కిష్టయ్య, పగిడి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.