
ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్న వంగిన విద్యుత్ స్తంభాలు!
ఈ69న్యూస్, హన్మకొండ/ఐనవోలు జూన్ 25
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామ శివారులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది.కొండపర్తి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ విద్యుత్ స్తంభాలు తీవ్రంగా వంగిపోయి, విద్యుత్ వైర్లు లూజుగా వేలాడుతూ గాలికి ఊగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.ప్రాణాలు పోయిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అనే ప్రశ్న గ్రామస్తుల నుంచి వినిపిస్తోంది. వర్షాకాలంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నప్పటికీ, విద్యుత్ శాఖ మాత్రం నిర్లక్ష్య ధోరణిని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.వంగిన స్తంభాలు కూలిపోతే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తు చర్యలు చేపట్టకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.ప్రమాదం జరిగాక హడావుడి చేయడం కాకుండా, వెంటనే స్పందించి వంగిపోయిన విద్యుత్ స్తంభాలను మార్చి, లూజుగా ఉన్న విద్యుత్ వైర్లను బిగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తిగా విద్యుత్ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.