
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం సాకరాశి కుంట సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై యువకులు విచక్షణ రహితంగా దాడి చేసి, బీరు సీసాలతో కొట్టిన ఘటన కలకలం రేపింది.
బైక్‌లపై వెళ్లే వారిని వెంటాడుతూ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. నగరంలో ఆకతాయిలు, రౌడీల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా గంజాయి లభించడం, బెల్ట్ షాపుల్లో 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుగుతుండటం వల్ల ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
ఈ ఘటనపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ప్రజలు కోరుతున్నారు. కాగా దాడి చేసిన యువకులు ప్రస్తుతం మిల్స్ కాలనీ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.