వరంగల్‌లో ఘనంగా కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు
మెగా కుటుంబానికి చెందిన సినీ నిర్మాత కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలను వరంగల్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు.కొణిదెల సుష్మిత అభిమాన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల మహర్షి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం విశేషంగా నిలిచింది.జన్మదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని మల్లికంబ మనోవికాస కేంద్రంలో అనాథ పిల్లలు, మనోవికాస సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, అలాగే మూగ, చెవిటి, అంధుల పిల్లల మధ్య ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు.అనంతరం పిల్లల చేతుల మీదుగా “ది ఏజ్ ఆఫ్ 14 టు 25 – ప్రొటెక్ట్ యువర్ లైఫ్” అనే అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. యువత తమ జీవితాన్ని సురక్షితంగా, సక్రమ మార్గంలో నడిపించుకోవడానికి ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.అదే విధంగా వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో పలువురు అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో సుష్మిత జన్మదినాన్ని జరుపుకోవడం అభిమానుల ప్రత్యేకతగా నిలిచింది.ఈ సందర్భంగా కొణిదెల సుష్మిత అభిమాన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల మహర్షి మాట్లాడుతూ, తాను 2001 సంవత్సరం నుంచి సుష్మితకు అభిమాని అని తెలిపారు. ఒక సందర్భంలో ఆమెను చూసినప్పుడు ఆమె సంప్రదాయం, సరళత, వినయం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. స్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎంతో సింపుల్‌గా అందరితో ప్రేమతో, మర్యాదగా మాట్లాడడం తనలో ఆమెపై మరింత అభిమానాన్ని పెంచిందని పేర్కొన్నారు.అప్పటి నుంచి తన అభిమానాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియకపోయినా, ఆమె ఏదో ఒక రంగంలో విజయాన్ని సాధించే వరకు వేచి చూసానని తెలిపారు. తరువాత ఆమె సినీ నిర్మాతగా విజయం సాధించిన తరువాత అభిమాన సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం ఆమె జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కొంతమంది ఎందుకు సుష్మితకు అభిమాన సంఘం ఏర్పాటు చేశావని ప్రశ్నించినా,తనకు ఆమె మంచి మనసు, వ్యక్తిత్వం ఎంతో నచ్చి అభిమానిగా మారానని తెలిపారు. తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా కేవలం అభిమానంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. తనకు సినిమా అవకాశాలు కావాలని లేదా వ్యక్తిగత లాభాల కోసం ఈ కార్యక్రమాలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.తాను టీజీఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తూనే లాయర్‌గా కూడా సమాజంలో అన్యాయానికి గురైన బాధితుల కోసం న్యాయపోరాటం చేస్తున్నానని తెలిపారు.అక్రమంగా తప్పుడు కేసుల్లో చిక్కుకున్న బాధితులకు న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యమని ఆయన అన్నారు.ప్రతి సంవత్సరం మార్చి నెలలో తన కుటుంబ సభ్యుల పుట్టినరోజులతో పాటు సుష్మిత జన్మదినాన్ని కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటానని తెలిపారు. ఆ నెల కోసం ప్రత్యేకంగా డబ్బులు కూడబెట్టుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. జీవితాంతం కొణిదెల సుష్మితకు అభిమానిగా కొనసాగుతానని ఆయన భావోద్వేగంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం కార్యదర్శి ఒగ్గు కిరణ్, కోశాధికారి రాజు, ఉపాధ్యక్షుడు సంతోష్, అడ్వకేట్ నరేష్‌తో పాటు పలువురు అభిమానులు సభ్యులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.