విద్యార్థులను విడుదల చేయండి పటోళ్ల నాగి రెడ్డి
అక్రమంగా నిర్భంధించిన విద్యార్థులను బేషరత్తుగా విడుదల చేయాలని రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల నాగి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, విద్యార్థుల అక్రమ నిర్భందనను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. గత నెల 18న ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో సిపిఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మాడవి హిడ్మా సహచరుల ఎన్కౌంటర్పై అధ్యయనం చేయడానికి వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం దమనకాండను తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు తమ కార్యక్రమం ప్రకటించి అధికారులకు తెలియజేసినా దుర్మార్గంగా వ్యవహరించడం, ‘మావోయిస్టులు’ అని కిరాయి మనుషులు నినాదాలు చేయడం, పోలీస్ స్టేషన్కు తరలించడం సిగ్గుచేటు అని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్ విషయం తేటతెల్లడానే భయంతో చింతూరు పోలీస్ స్టేషన్లో వారిని నిర్భందించారని ఆరోపించారు.కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ-జనసేన పార్టీలు మోడీ, అమిత్ షా సర్కారుకు వంతపడుతూ రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు ఎలాంటి హాని జరిగినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంఘం ప్రధాన కార్యదర్శి వెల్లూరు సదానందం డిమాండ్ చేశారు