వెనిజులాపై అమెరికా దురాక్రమణను ఖండించండి
వెనిజులా అధ్యక్షుడు మధురో దంపతులను వెంటనే విడుదల చేయాలి
జిల్లా వ్యాప్తంగా రేపు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు-జయప్రదం చేయండి-సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు వెనిజులాలోని వివిధ ప్రాంతాలపై అమెరికా బాంబు దాడులు చేయడం,వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మధురో దంపతులను అక్రమంగా అరెస్టు చేసి అమెరికా జైలులో నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని సీఐటీయూ జనగామ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,వెనుజులాలో అధికార మార్పు తీసుకురావాలన్న కుట్రలో భాగంగా మధురో ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు అమెరికా గత కొన్ని వారాలుగా వెనిజులా చుట్టూ తన సైనిక,నావికా దళాలను సమీకరించిందన్నారు.తమ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.అమెరికా వెంటనే వెనిజులాపై దురాక్రమణను ఆపాలని,కరేబియన్ సముద్రం నుంచి తన సైనిక దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.వెనుజులా అధ్యక్షుడు మధురో దంపతులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి తక్షణమే జోక్యం చేసుకొని మధురో దంపతులను వెంటనే విడుదల చేయించాలన్నారు.వెనిజులాలోని చమురు నిక్షేపాలు,సహజ వనరులను కొల్లగొట్టేందుకే అమెరికా ఈ దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.లాటిన్ అమెరికాను శాంతి ప్రాంతంగా ప్రకటించాలని,దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకునే ధోరణిని ప్రపంచ దేశాలు అంగీకరించకూడదన్నారు.అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే ఒక తీర్మానాన్ని ఆమోదించాలని,వెనిజులాపై దాడులను ఆపించేందుకు అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాలని సీఐటీయూ డిమాండ్ చేస్తున్నదన్నారు.భారత ప్రభుత్వం కూడా ఈ దాడులను ఖండిస్తూ వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో జనవరి 5(సోమవారం)జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రాలు,పని ప్రదేశాల్లో వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలను జయప్రదం చేయాలని రాపర్తి రాజు పిలుపునిచ్చారు.