సిపిఐ (ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
•ప్రపంచ ప్రజల శాంతికి అమెరికా దుష్ట రాజకీయం పెనుముప్పు–సిపిఐ (ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న సైనిక దాడులు, బెదిరింపులు ప్రపంచ ప్రజల శాంతికి తీవ్ర ముప్పుగా మారాయని సిపిఐ (ఎంఎల్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు.సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అరెస్టు చేయాలన్న అమెరికా ప్రకటనలు సామ్రాజ్యవాద దురహంకారానికి నిదర్శనమన్నారు.స్వతంత్ర సార్వభౌమ దేశాలపై దాడులు చేయడం, ప్రజా ప్రభుత్వాలను కూల్చివేయడం అత్యంత దారుణమైన చర్యలని ఆయన ఖండించారు.వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులు అక్కడి అపారమైన చమురు వనరులను దోచుకోవాలన్న దురుద్దేశంతోనే జరుగుతున్నాయని, ఇది మానవ హక్కుల పేరిట సాగుతున్న వనరుల దోపిడీ యుద్ధం తప్ప మరొకటి కాదన్నారు.ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికానే నేడు ప్రపంచ ప్రజలకు అతిపెద్ద శత్రువుగా మారిందని విమర్శించారు. గతంలో ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలను ధ్వంసం చేసిన సామ్రాజ్యవాద శక్తి ఇప్పుడు వెనిజులాను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచానికి తీవ్ర హెచ్చరికగా మారిందన్నారు.వెనిజులా ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కును కలిగిన దేశమని, ఆ హక్కును కాలరాస్తూ అమెరికా సైనిక బూట్లతో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తోందని ఆరోపించారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి నియమాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.ప్రపంచ దేశాలు, ప్రజాస్వామ్య శక్తులు, ప్రజా ఉద్యమాలు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. వెనిజులాపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, అమెరికా తన సైనిక బెదిరింపులను ఉపసంహరించుకుని వెనిజులా సార్వభౌమత్వాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు.ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత, ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.