సిద్ధాపూర్లో వృద్ధుడి హత్య… మహిళపై కేసు నమోదు
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో వృద్ధుడి హత్య ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధాపూర్‌కు చెందిన బాల్నే రాజ్‌కుమార్ (40) ఫిర్యాదు మేరకు వంగ ఇందిరపై మర్డర్ కేసు నమోదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ తల్లిదండ్రులు బాల్నే మొగిలి, సరోజన గత 20 సంవత్సరాలుగా హనుమకొండలో అమృత హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి స్వగ్రామం సిద్ధాపూర్. కుటుంబానికి చెందిన వంగ ఇందిర అనే మహిళ కూడా అదే ఇంట్లో నివసిస్తోంది.
మూడు నెలల క్రితం సరోజన మరణించడంతో, బాల్నే మొగిలి స్వగ్రామానికి వచ్చి తన సొంతింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో వంగ ఇందిరతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు మొగిలి తన కుమారుడికి పలుమార్లు తెలియజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.జూన్ 24, 2026న వంగ సారంగపాణి అనే బావమరిది ఫోన్ చేసి, ఇంటి వెనుక భాగంలో మొగిలి మృతదేహం ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న రాజ్‌కుమార్ తన తండ్రి ముఖం, నుదురు, ఛాతీ, మెడ భాగాల్లో పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ మేరకు రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై వంగ ఇందిరపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది