హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు. హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు జనగామ జిల్లా అధ్యక్షుడు,హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు.ఆదివారం చిల్పూరు మండలంలోని వెంకటాద్రిపేట,కొండాపూర్ గ్రామాల్లో హమాలి కార్మికులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను యూనియన్ నేతలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.హమాలి కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా భారత కార్మిక వర్గానికి నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటు చర్యగా ఆయన పేర్కొన్నారు.“ఈ దేశ సంపద సృష్టి కార్మికుల శ్రమపై ఆధారపడి ఉంది.అలాంటి కార్మిక వర్గం మెడపై కత్తి పెట్టడం దారుణం”అని రాజు మండిపడ్డారు.కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని,ఇందుకు కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఏడు లక్షల మంది హమాలి కార్మికులు ఉన్నప్పటికీ,వారికి ప్రమాద బీమా,ఇన్సూరెన్స్,పీఎఫ్,ఈఎస్ఐ,హెల్త్ కార్డులు,పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు అందించడం లాంటి ప్రాథమిక హక్కులు కూడా లభించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈనెల 27వ తేదీన జనగామ పట్టణంలో జరగనున్న హమాలి యూనియన్ రాష్ట్ర మహాసభల్లో ఈ సమస్యలన్నింటిని చర్చించి,భవిష్యత్తు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించనున్నట్టు రాపర్తి రాజు తెలిపారు.సమావేశంలో హమాలి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అపరాధపు రాజు,గ్రామ కమిటీ నాయకులు తోట వీరస్వామి,మంద రాజు,గుండెబోయిన సదానందం,కొండ రవి,బుర్ర లింగం,నూనె బిక్షపతి,కనకం రవీందర్,కందుకూరి శ్రీను,కిష్టయ్య,పోలు సంపత్ తదితరులు పాల్గొన్నారు.