సరస్వతి అంత్య పుష్కరాల పనులుసరస్వతి అంత్య పుష్కరాల పనులు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 February, 2026E69NEWS

సరస్వతి అంత్య పుష్కరాల పనులు

సరస్వతి అంత్య పుష్కరాల పనులు

సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి,సౌకర్యాల పనులు మే మొదటి వారం నాటికి పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా దేవాలయం, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్, కాళేశ్వరం వంతెన, ముక్తి వనం తదితర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న పనుల పురోగతిని ఆమె సమీక్షించారు.అనంతరం దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీసు, విద్యుత్, ఆర్ & బి, ఇరిగేషన్, దేవాదాయ శాఖల అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.30 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.ఈ పనుల పూర్తి కోసం నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని, ఇంకా కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ప్రాధాన్యతగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.సరస్వతి ఆది పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, అంత్య పుష్కరాలకు సుమారు 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.పనుల పురోగతిని ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని, ఎక్కడైనా జాప్యం జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుదురుపల్లి–బీరసాగర్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను వెంటనే సమర్పించాలని, సిరొంచం నుండి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.టెంట్ సిటీ ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ వద్ద జనరేటర్ల ఏర్పాటు చేయాలని, పుష్కరాల విశిష్టతను చాటిచెప్పేలా మ్యూజియం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో పాటు స్వామి దర్శనానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అంచనా ప్రతిపాదనల్లో ఏవైనా మార్పులు ఉంటే రెండు రోజుల్లో సమర్పించాలని, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు సబ్ కలెక్టర్ శ్రీ మయాంక్ సింగ్‌ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు.అదే విధంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న ట్రాఫిక్, పార్కింగ్ రోడ్ మ్యాప్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌కు వివరించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *