సైబర్ నేరాలపై అవగాహన సదస్సుసైబర్ నేరాలపై అవగాహన సదస్సు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ1 April, 2026E69NEWS

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి గోరి గ్రామంలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ గారి ఆదేశాల మేరకు సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి ప్రధానంగా హాజరై,సిబ్బందితో కలిసి మండల రైతులు, గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజల్లో జాగృతి అవసరం ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ,ముఖ్యంగా “డిజిటల్ అరెస్ట్” పేరిట జరుగుతున్న మోసాలు అత్యంత ప్రమాదకరమని తెలిపారు.సైబర్ నేరస్తులు తమను పోలీస్ అధికారులు, సీబీఐ అధికారులు అంటూ పరిచయం చేసుకుని,ఫోన్ కాల్స్ ద్వారా అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. అయితే, “డిజిటల్ అరెస్ట్” అనే వ్యవస్థ అసలు లేదని ఆయన స్పష్టంగా తెలియజేశారు.ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదని, వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.అలాగే, ఆన్లైన్ పెట్టుబడుల పేరిట అధిక లాభాలు వస్తాయని చెప్పే మోసపూరిత ప్రకటనలు ఎక్కువగా పెరుగుతున్నాయని తెలిపారు.ఇలాంటి ప్రకటనలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంది మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎటువంటి పెట్టుబడి చేసే ముందు సరైన సమాచారం సేకరించుకోవాలని సూచించారు.బ్యాంకు భద్రతపై కూడా ఎస్సై కీలక సూచనలు చేశారు.డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని హెచ్చరించారు.బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థలు ఎప్పటికీ ఫోన్ ద్వారా ఇలాంటి సమాచారం అడగవని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాల పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ఏపీకే యాప్‌లపై కూడా ఆయన అప్రమత్తం చేశారు.ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని,అటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.అదేవిధంగా, “ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని” చెప్పే అపరిచిత కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని, ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే సైబర్ నేరాలను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పోలీసు సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ద్వారా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *