న్యాయస్థానం ఆదేశాల అమలులో జాప్యం
నారాయణగిరి గ్రామ పరిధిలోని చటేల్ పర్రె తండాలో గల సర్వే నంబర్ 237/ఏలో ఎ.4.12 గుంటల భూమికి సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు కావడం లేదని రైతు వల్లపురెడ్డి కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సదరు భూమికి సంబంధించి సివిల్ న్యాయస్థానం దావా సంఖ్య 869/2022, తేదీ 12-09-2023న ఇచ్చిన తీర్పు మేరకు తన పేరును రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కృష్ణారెడ్డి 27-10-2023న ధర్మసాగర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి న్యాయమూర్తి ఎన్.వి. శ్రావణ్ కుమార్ 16-07-2026న ఉత్తర్వులు జారీ చేస్తూ, పిటిషనర్ 27-10-2023న సమర్పించిన వినతిని చట్ట ప్రకారం సహేతుకమైన సమయంలో పరిష్కరించాలని ధర్మసాగర్ తహసీల్దార్‌ను ఆదేశించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువడి 24 రోజులు గడిచినా, ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతున్నా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం తనకు నోటీసు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో మరింత జాప్యం జరిగితే న్యాయస్థానం ధిక్కరణ చర్యలను ఆశ్రయిస్తామని, మరో ఏడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కృష్ణారెడ్డి తెలిపారు.ఈ విషయంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయించి, తనకు న్యాయం చేయాలని రైతు వల్లపురెడ్డి కృష్ణారెడ్డి కోరారు.