ఐద్వా జాతీయ 14వ మహాసభలను జయప్రదం చేయాలి
పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్న జాతీయ 14వ మహాసభల నేపథ్యంలో,నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ..“ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు మహిళలు వేలాదిగా తరలిరావాలి.ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక బండి రావాలి” అని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆమె..“దేశవ్యాప్తంగా నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరై మహిళల సమస్యలపై విస్తృత చర్చలు జరుపుతారు.మహిళల సంక్షేమం,అభివృద్ధి,రక్షణ కోసం భవిష్యత్ పోరాటాల దిశగా కీలక తీర్మానాలు చేయబడతాయి.ఇందుకు హైదరాబాద్ వేదిక కానుంది”అని తెలిపారు.మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు,దౌర్జన్యాలు,అత్యాచారాలు,హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..“ఈ అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.నిందితులకు త్వరితగతిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు.అలాగే మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ,జిట్టా సరోజ,నిమ్మల పద్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ,ఎండి సుల్తానా,సిహెచ్ నాగమణి,సహాయ కార్యదర్శి పాదూరు గోవర్ధన,జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ,కౌసల్య,టి.నాగమణి,సైదమ్మ,ఉమారాణి,మంజుల తదితరులు పాల్గొన్నారు.