గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా కార్యక్రమం ప్రారంభం
మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి)లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పి వి) టీకా కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నాయక్ ప్రారంభించి, మండలంలోని 13 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరూ ఈ ఉచిత టీకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా సుమారు 90 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని సూచించారు.
కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పూజిత, పీహెచ్ఎన్ఓ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు, లక్ష్మికుమారి, ఏఎన్ఎంలు సరళ, శ్రీదేవి, స్టాఫ్ నర్స్ పద్మ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.