చాందిని సీడ్స్‌పై చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లె గ్రామ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న చాందిని సీడ్స్ కంపెనీ యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.రైతులు పండించిన సీడ్ మొక్కజొన్నను తక్షణమే కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు.గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులను మంచి దిగుబడి వస్తుందని నమ్మబలికి, దాదాపు 30 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేయించారు.పంట కోత సమయం రాగానే చాందిని సీడ్స్ యజమానులు బాధ్యత నుంచి తప్పించుకుంటూ రైతులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినట్లు తెలిపారు.రైతుల వినతిని స్వీకరించిన బుర్ర వెంకటేష్ గౌడ్,వారి పొలాలను సందర్శించి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని,కంపెనీ యజమానులు వెంటనే స్పందించి పండిన పంటను కొనుగోలు చేయాలని కోరారు. క్వింటాల్‌కు రూ.3200 చెల్లిస్తామని హామీ ఇస్తూ బాండ్ పేపర్లపై ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు.రైతులు కష్టపడి పండించిన పంటకు తగిన ధర చెల్లించి, వారికి రావాల్సిన డబ్బులను వెంటనే అందించాలని కంపెనీ యజమానులను డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏలేటి రామయ్యపల్లె గ్రామ సర్పంచ్ కోడారి అశోక్, రైతులు కాశిరెడ్డి తిరుపతి రెడ్డి, రమాకాంత్ రెడ్డి, కనుకుల జగన్, కనుకుల మహిపాల్, శీను తదితరులు పాల్గొన్నారు.