
తమ్మడపల్లి జి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ సమస్యపై స్పందించిన విద్యుత్ అధికారులు
ఈ 69న్యూస్ జఫర్ఘడ్ మార్చి 12: జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఫేజ్ వైరు కాలిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనపై ‘ఈ 69 న్యూస్’లో ప్రచురితమైన వార్త కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖ ఎడిఇ రణధీర్ రెడ్డి సంఘటనపై వెంటనే స్పందించి గురువారం గ్రామానికి చేరుకున్నారు.గ్రామంలోని సంబంధిత ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి, దాని కింద ఉన్న వ్యవసాయ మోటార్ల వివరాలను సేకరించారు.ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం, మోటార్ల వినియోగం, విద్యుత్ మీటర్ల స్థితి వంటి అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎడిఇ రణధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సంబంధిత ట్రాన్స్ఫార్మర్ కింద మొత్తం 19 వ్యవసాయ మోటార్లు నడుస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.అయితే వాటిలో కేవలం 9 మంది రైతులు మాత్రమే తమ సర్వీస్ నంబర్లు చూపించారని, మిగతా రైతులు తమ కనెక్షన్ వివరాలను ఇప్పటివరకు సమర్పించలేదని చెప్పారు.మిగతా రైతులు రెండు రోజుల్లోగా తమ సర్వీస్ నంబర్లు మరియు కనెక్షన్ వివరాలను విద్యుత్ శాఖ అధికారులకు చూపించాలని సూచించారు.ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ పడటంతో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.గ్రామంలో వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ సమస్య ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, అవసరమైతే రైతులకు ఇబ్బందులు కలగకుండా మరో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదే సమయంలో అనుమతులు లేకుండా మోటార్లు నడుపుతున్న రైతులు వెంటనే అధికారిక విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని, లేకపోతే అటువంటి మోటార్లపై విద్యుత్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.గ్రామంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. రైతులు కూడా విద్యుత్ వినియోగంలో నిబంధనలు పాటించి శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎఎల్ఎం గుర్రం కుమార్,కట్టర్ సాయి, తదితరులు పాల్గొన్నారు