
హనుమకొండ: చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసే సమయంలో పసుపుకు బదులుగా కృత్రిమ రసాయన రంగులు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు.
ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణితో కలిసి పలు చికెన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు వ్యాపారులు చికెన్‌ను ఆకర్షణీయంగా చూపించేందుకు నిషేధిత రసాయన రంగులు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.
రసాయన రంగులు కలిపిన మాంసం సేవించడం వల్ల ఉదర, పేగు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సంబంధిత దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే మాంసాన్ని కొనుగోలు చేయవద్దని సూచించారు.